పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహన వేడుకలు జరుగుతున్న సందర్భంలోనే మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జోదా ఫటక్ ప్రాంతంలో రైలు పట్టాలకు సమీపంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో.. అనుకోకుండా రెండు పట్టాలపైకి రైళ్లు ఎదురెదురుగా వచ్చి...జనాల మీదకు దూసుకెళ్లడంతో దాదాపు 50 మంది మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 1000 మందికి పైగా జనాలు గుమిగూడినట్లు సమాచారం. వారందరూ రైల్వే పట్టాలతో పాటు.. పట్టాల చుట్టూ నిలుచుని వేడుకలు చూస్తున్న వారే. ఇదే ఘటనలో అనేకమంది క్షతగాత్రులు గాయాలపాలయ్యారు.
వీరందరినీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వేడుకల్లో భాగంగా బాణాసంచా కాల్చడంతో రైళ్లు వస్తున్న శబ్దం కూడా వినిపించలేదని.. కాసేపు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో అనేకమంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో ప్రతీ సంవత్సరం దసరా మహోత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. కాగా.. అనుకోకుండా జరిగిన ఈ రైలు ప్రమాదం ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తుకి ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రానికి సమాచారాన్ని పంపింది. రైల్వేశాఖమంత్రి పీయూష్ గోయల్ కూడా సంఘటనపై తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్ర హోంశాఖ.. పంజాబ్ హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో మాట్లాడడం జరిగింది. కేంద్ర రైల్వే సహాయమంత్రి మనోజ్ సిన్హా ఈ విషయం తెలియగానే వెనువెంటనే పంజాబ్‌కు పయనమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. దసరా సందర్భంగా ఇంతటి ఘోరం జరగడం పట్ల తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రభుత్వం మరణించిన వారికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
#WATCH The moment when the DMU train 74943 stuck people watching Dussehra celebrations in Choura Bazar near #Amritsar (Source:Mobile footage-Unverified) pic.twitter.com/cmX0Tq2pFE
— ANI (@ANI) October 19, 2018