భారతదేశ చరిత్రలో తొలిసారి.. సీజేఐపై అభిశంసన నోటీసు

భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై అభిశంసన నోటీసులను ప్రతిపక్షాలు ఇచ్చాయి.

Last Updated : Apr 22, 2018, 06:20 AM IST
భారతదేశ చరిత్రలో తొలిసారి.. సీజేఐపై అభిశంసన నోటీసు

భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై అభిశంసన నోటీసులను ప్రతిపక్షాలు ఇచ్చాయి. ఇప్పటివరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయినప్పటికీ.. సీజేఐపై నోటీసులు ఇవ్వటం ఇదే ప్రప్రథమం. కాంగ్రెస్‌ నేతృత్వంలో 6 విపక్ష పార్టీలు సీజేఐ దీపక్ మిశ్రాను అభిశసించాలంటూ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు శుక్రవారం నోటీసులు అందజేశారు.

ఈ అభిశంసన నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఇటీవలే రాజ్యసభ నుండి రిటైర్ అయిన ఏడుగురు సభ్యులు సంతకాలు చేశారు.  కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎన్‌సీపీ, ఎస్పీ, బీఎస్పీలకు చెందిన ఎంపీలు నోటీసుపై సంతకాలు చేశారు. టీఎంసీ, ఆర్జేడీ, డీఎంకే, మరి కొన్ని ప్రతిపక్ష పార్టీలు అభిశంసన నోటీసుపై సంతకం చేసేందుకు నిరాకరించాయి. సొంత కాంగ్రెస్ లోనే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, హోం శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింగ్ మరి కొందరు కూడా అభిశంసన నోటీసుపై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలిసింది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అభిశంసన పత్రంపై సంతకాల సేకరణ జరిగింది. సీజేఐ దుష్ప్రవర్తనతోపాటుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నోటీసులో విపక్ష నేతలు తెలిపారు. సీజేఐ తీరుపై 5 ఆరోపణలు చేశారు.

* ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేసు విషయంలో ముడుపులు తీసుకోవడం

* సుప్రీంకోర్టులో ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌పై విచారణకు సంబంధించిన పిటిషన్‌ను ముందు తేదీకి మార్చటం

* రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం.

* దీపక్ మిశ్రా న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన వ్యవహారం. దీపక్ మిశ్రా ఈ భూమిని కొనుగోలు చేసే సమయంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

* కేసులను ఇతర న్యాయమూర్తులకు కేటాయించటంలో మిశ్రా తన అధికారాలను దుర్వినియోగం చేయడం

అభిశంసనను రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు: జైట్లీ

సీజేఐపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఓ రాజయీక కుట్రగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నోటీసులను కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ అస్త్రంగా వినియోగించుకుంటోందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విమర్శించారు. జడ్జి లోయా కేసులో కాంగ్రెస్‌ పన్నిన కుట్రను సుప్రీంకోర్టు భగ్నం చేయటంతో ప్రతీకారంగానే అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చిందన్నారు.

జడ్జి లోయా మృతిపై కుటుంబసభ్యులు మొదట అనుమానాలు వ్యక్తం చేసినా.. ఆ తర్వాత మేనేజ్ చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. న్యాయవ్యవస్థపై ఎవరూ విశ్వాసం కోల్పోవద్దని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

అభిశంసన ప్రక్రియ ఇలా:

* న్యాయమూర్తుల (ఎంక్వైరీ) చట్టం-1969 కింద సుప్రీంకోర్టు జడ్జీని తొలగించేందుకు రాజ్యాంగంలోని 124(4)వ అధికరణ ఓ విధానాన్ని స్పష్టంచేసింది.

* 100మంది లోక్‌సభ ఎంపీలు లేదా 50మంది రాజ్యసభ ఎంపీల సంతకాలతో అభిశంసన తీర్మాన నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు లేదా రాజ్యసభ ఛైర్మన్‌కుగానీ ఇవ్వాలి.

* లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ఆ నోటీసును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

* ఒకవేళ నోటీసును ఆమోదిస్తే.. స్పీకర్/చైర్మన్ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి, హైకోర్టు జడ్జి, ఒక న్యాయ నిపుణుడు ఈ కమిటీలో ఉంటారు. సదరు న్యాయమూర్తిపై వచ్చిన అభియోగాలు నిజమో, కాదో ఆ కమిటీ తేలుస్తుంది.

* ఒకవేళ నోటీసును కమిటీ బలపరిస్తే.. సభలో దానిని చర్చకు అనుమతిస్తారు. ఓటింగ్ రోజున ఉభయసభలకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.

* అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, సీజేఐని తొలగించాల్సిందిగా ఉభయసభలు సిఫారసు చేస్తాయి. రాష్ట్రపతి సీజేఐని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు.

Trending News