వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు పద్మావత్ చిత్ర వివాదం సెగ కాస్తా ఆ చిత్ర నిర్మాతల తరపున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి, ఆ కేసు గెలిచిన సీనియర్ అడ్వకేట్‌కి తగిలింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసి, సహ నిర్మాతగా నిర్మించిన పద్మావత్ సినిమా విడుదలని కర్ణిసేన మొదటి నుంచీ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలపై హర్యానా, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు నిషేధం విధించడంపై సుప్రీం కోర్టుని ఆశ్రయించిన పద్మావత్ నిర్మాతలు.. ఆయా రాష్ట్రాల్లోనూ సినిమా విడుదల అయ్యే విధంగా ఆదేశాలు జారీచేయాల్సిందిగా కోర్టుకి విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుంటే, పద్మావత్ చిత్ర నిర్మాతల తరపున వాదనలు వినిపించి, వారి పిటిషన్ గెలిచేలా చేసిన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వెనే ఇప్పుడు స్వయంగా పోలీసులని ఆశ్రయించాల్సి వచ్చింది. అందుకు కారణం తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడమేనట. కర్ణిసేన కమ్యూనిటికీ చెందిన వారిగా చెప్పుకుంటున్న కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తన కార్యాలయానికి ఫోన్ చేసి, తన అంతుచూస్తానని బెదిరిస్తున్నారని హరీష్ సాల్వె ఢిల్లీ పోలీసులకి ఫిర్యాదు చేశారు.
Delhi police registers FIR against unknown person for giving life threat to senior advocate Harish Salve. #Padmaavat
— ANI (@ANI) January 19, 2018
హరీష్ సాల్వె ఫిర్యాదుపై స్పందించిన ఢిల్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. జనవరి 25న ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ సినిమా అంతకన్నా ముందుగా ఇంకెన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందో మరి!