నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి(జులై 18) నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరుగనున్నాయి.

Last Updated : Jul 18, 2018, 08:21 AM IST
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి(జులై 18) నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరుగనున్నాయి. సంప్రదాయం ప్రకారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని  నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్‌, ట్రిపుల్ తలాక్‌, ఓబీసీ బిల్లుల ఆమోద ముద్రకు సహకరించాలని కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రం లేఖ ద్వారా కోరింది.

మరో పది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మరింత రాద్ధాంతం చేయడానికి బీజేపీ సిద్ధపడుతుండగా.. ఆర్థిక రంగ వైఫల్యాలు, రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయం, కశ్మీర్‌ సంక్షోభం, ధరల పెరుగుదల లాంటి సమస్యలకు పరిష్కారం  చూపకపోతే  అధికార పక్షంపై  ఎదురుదాడికి దిగాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. 18 పని దినాల పాటు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార పక్షం 46 బిల్లుల్ని చర్చించి ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తోంది. వాటిలో
మహిళా రిజర్వేషన్‌, ట్రిపుల్ తలాక్‌, ఓబీసీ, వినియోగదారుల పరిరక్షణ బిల్లు, ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, జాతీయ వైద్య కమిషన్‌ ఏర్పాటు,  డిపాజిట్ల నియంత్రణ వంటి బిల్లు వంటివి ఉన్నాయి.

కేంద్రమంత్రి అనంతకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ సభకు సహకరించాలని అన్ని పక్షాలకూ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ‘తెలుగుదేశం పార్టీ సభలో ప్రవేశపెట్టే అవిశ్వాసంతో సహా అన్ని అంశాలపై చర్చించడానికి సిద్దమే. ఏ సమస్యను లేవనెత్తినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.

ఎన్డీఏ స‌ర్కార్‌పై మ‌ళ్లీ అవిశ్వాసం

ఎన్డీఏ స‌ర్కార్‌పై టీడీపీ మరోసారి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట న‌ర్సింహులు, స్పీక‌ర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని అందించారు. పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల తొలి రోజునే అవిశ్వాస తీర్మాణంపై చ‌ర్చించాల‌ని నోటీసులో కోరారు.

Trending News