రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం: మోదీ

పేదలు, రైతులు, యవత ఇలా అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందించి కొత్త భారతదేశాన్ని ఆవిష్కరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

Last Updated : Jul 15, 2018, 05:05 PM IST
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం: మోదీ

పేదలు, రైతులు, యవత ఇలా అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందించి కొత్త భారతదేశాన్ని ఆవిష్కరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు అయ్యేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నో పథకాలను సగంలోనే వదిలేసినా.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ సభలో వ్యాఖ్యానించారు. యూపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం మీర్జాపూర్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా బన్సాగర్‌ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే మీర్జాపూర్‌ వైద్య కళాశాలకూ, 229 కోట్లతో మీర్జాపూర్‌-ఆలహాబాద్‌ నేషనల్‌ హైవేకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నిర్వహించిన రోడ్‌షోలో మోదీ ప్రసంగించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల యూపీలో ఎప్పుడో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని ఆరోపించారు. నలభై ఏళ్ల క్రితం బన్సాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రాజెక్టును పూర్తిచేసినట్లు మోదీ తెలిపారు. గత రెండేళ్లలో 5 కోట్ల మందిని భారతీయులను పేదరికం నుండి బయటకు తీసుకొచ్చామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను మోదీ కొనియాడారు.

Trending News