ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక సీఎం లీగల్ నోటీసులు !

ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లీగల్ నోటీసులతో షాక్‌ ఇచ్చారు. 

Last Updated : May 8, 2018, 04:17 PM IST
ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక సీఎం లీగల్ నోటీసులు !

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కర్ణాటక సీఎం అభ్యర్థి బరిలో నిలిచిన బీజేపీ నేత యడ్యూరప్పలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లీగల్ నోటీసులతో షాక్‌ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తనపై అసత్య ఆరోపణలు చేసినందుకుగాను సీఎం సిద్ధరామయ్య ఆ ముగ్గురిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కర్ణాటక సీఎం అభ్యర్థి యడ్యూరప్పలకు సోమవారం లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. '' నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై దావా వేశాను. వారికి లీగల్‌ నోటీసులు సైతం పంపించా. వాస్తవాలతో సంబంధం లేకుండా బహిరంగంగా వారు నాపై అసత్య ఆరోపణలు చేశారు. అందుకే ప్రజల సమక్షంలోనే వాళ్లు నాకు క్షమాపణలు చెప్పాలి. లేదంటే వారు చట్టరీత్యా చర్యలు ఎదుర్కోకతప్పదు'' అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం సిద్ధరామయ్య స్పష్టంచేశారు. 

విజయ్‌ ఈశ్వరన్‌ అనే వ్యాపారవేత్త పాల్పడిన కుంభకోణాల్లో సీఎం సిద్ధరామయ్యకు కూడా వాటాలు వున్నాయని, ఆయన్ని రక్షించేందుకు సిద్ధరామయ్య ప్రణాళికలు రచిస్తున్నారని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో వున్న బీజేపీ నేతలు.. సిద్ధరామయ్య-ఈశ్వరన్‌ కరచలనం చేస్తున్న ఓ ఫోటోను మీడియాకు విడుదల చేసి వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సరిగ్గా ఇటువంటి పరిణామాలనే తీవ్రంగా పరిగణించిన సిద్ధరామయ్య.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా, కర్ణాటక సీఎం రేసులో నిలబడిన బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు లీగల్ నోటీసులతో కౌంటర్ ఇచ్చారు.

సిద్ధరామయ్య దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!

Trending News