ప్రధాని కార్యాలయానికి ''కనిపించని 'కామా'' చెప్పిన గుణపాఠం !

ప్రధాని కార్యాలయం చేసిన ఓ తప్పిదం వారి మాటల అర్థాన్నే మార్చేసింది

Last Updated : Feb 8, 2018, 06:43 PM IST
ప్రధాని కార్యాలయానికి ''కనిపించని 'కామా'' చెప్పిన గుణపాఠం !

కేంద్రం పథకాలను, ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయాలు సోషల్ మీడియా వారధిగా ప్రజలతో పంచుకోవడంలో బిజీగా వుండే ప్రధాని కార్యాలయం ఎప్పటిలాగే గురువారం కూడా ఓ ట్వీట్ చేసింది. అదేమంటే "నిరుపేదలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించడానికి అందరం కలిసి కృషి చేద్దాం" అని ప్రధాని మోడీ చేసిన విజ్ఞప్తిని ఆయన తరపున ప్రధాని కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది. కానీ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటకే సోషల్ మీడియాలో ప్రధాని కార్యాలయం, ప్రదాని నరేంద్ర మోడీ సర్కార్ పై వ్యంగ్యాస్త్రాలు మొదలయ్యాయి. అదేంటి !! ఇందులో ప్రధాని కార్యాలయం చేసిన తప్పేంటి ? ప్రధాని మోడీ అభిప్రాయాన్నే ప్రధాని కార్యాలయం పంచుకుంది కదా అని ఓ డౌట్ రావచ్చేమో! అయితే, అసలు ఫిట్టింగ్ ఆ ట్వీట్ లోనే వుంది.

 

"లెటజ్ వర్క్ టుగెదర్ ఇన్ ప్రొవైడింగ్ ది పూర్ క్వాలిటీ అండ్ అఫర్డబుల్ హెల్త్ కేర్ : పీఎం నరేంద్ర మోడీ" అని ప్రధాని కార్యాలయం చేసిన ట్వీట్‌లో కామా లోపించింది. దీంతో ఒక మంచి సదుద్దేశంతో మోడీ చేసిన విజ్ఞప్తికి పూర్తి అర్థమే మారిపోయింది. అందుకే దొరికింది ఇదే మంచి అవకాశం అన్నట్టుగా ఆయన్ని విమర్శించే వాళ్లు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే నెటిజెన్స్ వెంటనే ఆ ట్వీట్‌కి రిట్వీట్ చేయడం, సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. 

 

ఈ చిన్న తప్పిదం మొత్తం అర్థాన్నే మార్చేసింది. దీంతో కామాకు వున్న విలువ ఏంటో ఆ తప్పు చేసేవారికి మరోసారి తెలిసొచ్చేలా చేసింది. ఇక ఈ తప్పిదం సంగతిని కాసేపు పక్కనపెడితే.. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సేవలు, ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు, అభిప్రాయాలని ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకోవడంలో ప్రధాని కార్యాలయంలో పనిచేస్తోన్న సోషల్ మీడియా విభాగం కృషిని మాత్రం అభినందించి తీరాల్సిందే.

 

Trending News