న్యూఢిల్లీ: ఆసియా అపర కుబేరుడిగా చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు జాక్ మా అగ్రస్థానంలో నిలిచారు. భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. అపర కుబేరుల సంపద లెక్కించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ఈ విషయాల్ని వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు కూలుతున్నాయి. ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న భయాలు లేకపోలేదు. ఈ క్రమంలో కుబేరుల స్థానాలు మారిపోయాయి.
Also Read: 2నిమిషాల్లో పాన్ కార్డ్, ఆధార్ ఇలా లింక్ చేసుకోండి
44.5 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకు చెందిన జాక్ మా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మళ్లీ నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 41.9 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. అంబానీ కన్నా జాక్ మా సంపద 2.6 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2018 మధ్యలో ఆసియాలో నంబర్ 1 సంపన్నుడి హోదాను కోల్పోయిన జాక్ మా.. ఇంత కాలానికి ఆ స్థానానికి మళ్లీ చేరుకున్నారు.
Avengers బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అందాలివిగో!
మార్కెట్లు పతనం కావడంతో అంబానీ సంపద విలువ ఏకంగా 5.8 బిలియన్ డాలర్ల మేర కోల్పోయారు. స్టాక్ మార్కెట్ పతనంలో రియయన్స్ షేర్లు రికార్డు స్థాయిలో 12 శాతం మేర పడిపోయాయి. 2009 తర్వాత దాదాపు 11ఏళ్లకు ఈ స్థాయిలో రిలయన్స్ షేర్లు పడిపోవడం గమనార్హం. దీంతో ముఖేష్ అంబానీ స్థానాన్ని జాక్ మా అందిపుచ్చుకున్నారు. కరోనాతో జాక్ మా వ్యాపారంలో ఒడిదొడుకులు ఎదురైనా క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్స్ సేవలకు డిమాండ్ రావడంతో ఆయన సంపద తగ్గలేదు.