రుణగ్రహీతలకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ !!

ఇకపై రుణం తీసుకునే వారికే కాదు.. ఇప్పటికే రుణం పొందిన వారికి కూడా ఇది వర్తించనుంది. 

Last Updated : Mar 2, 2018, 09:43 AM IST
రుణగ్రహీతలకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ !!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) జారీ చేసే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు ఇకపై మరింత ప్రియం కానున్నా యి. ఇకపై రుణం తీసుకునే వారికే కాదు.. ఇప్పటికే రుణం పొందిన వారికి కూడా ఇది వర్తించనుంది. అవును గతంలో రుణాలు పొందిన వారు చెల్లించే నెలవారీ వాయిదాలు సైతం పెరగనున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ఎస్బీఐ ప్రకటించడంతో ఆ బ్యాంకు వినియోగదారులు సంబరాలు జరుపుకున్నారు. కానీ ఆ మరుసటి రోజే రుణాలపైనా వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించి రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది ఎస్బీఐ. అన్నిరకాల రుణాలపై వడ్డీ రేటు పెరుగుదల గరిష్ఠంగా 0.20 శాతం వరకు పెరగనుంది. పెంచిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని బ్యాంకు తమ ప్రకటనలో స్పష్టంచేసింది. 

2016 ఏప్రిల్‌ తర్వాత మొదటిసారిగా ఎంసిఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు) ఆధారిత వడ్డీ రేట్లను సవరించినట్టు బ్యాంకు పేర్కొంది. ఏడాది కాలపరిమితి గల ఎంసిఎల్‌ఆర్‌  7.95 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. ఆరు నెలల కాలానికిగాను ఎంసిఎల్‌ఆర్‌ను 0.10 శాతం పెంచడంతో ఆ కేటగిరీ ప్రస్తుతం 8 శాతానికి చేరుకుంది. మూడేళ్ల కాలానికి రుణ రేటు 0.25 శాతం పెరిగి 8.35 శాతానికి చేరింది. రేట్ల పెంపు మొత్తం రుణగ్రహీతలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ ఎస్బీఐ ఫండ్స్ లిక్విడిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా రుణాలపై వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ఇతర బ్యాంకులతో పోల్చితే ఎస్బీఐ వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలోనే ఉన్నాయని ఎస్‌బిఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పికె గుప్తా తెలిపారు.

Trending News