దీర్ఘకాలికంగా అచేతన వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కోలుకొనే అవకాశం తక్కువగా ఉన్నప్పుడు.. కొన్ని పరిమితులతో వారి మరణానికి అనుమతించవచ్చని భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఎంతో బాధను అనుభవిస్తూ.. వేదనతో మరణించడం కంటే సుఖంగా మరణించడంలోని హుందాతనాన్ని అనుభవించే హక్కు రోగులకు ఉందని సుప్రీం కోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇదో చారిత్రాత్మకమైన తీర్పు కావడం గమనార్హం. జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం ఎన్నో తర్జన భర్జనల తర్వాత ఈ తీర్పుని వెలువరించింది. అయితే రోగి పరోక్ష మరణానికి సంబంధించి.. అందుకు గల నిర్ణయాధికారాన్ని మెడికల్ బోర్డుకు అందించింది కోర్టు. అయితే ఈ అంశంపై చట్టం రావాల్సి ఉంటుందని.. అంతవరకు పలు గైడ్లైన్స్ మెడికల్ బోర్డుకి అందుబాటులో ఉంటాయని తీర్పులో తెలపడం గమనార్హం.
ఈ తీర్పులో పలు విషయాలను న్యాయమూర్తులు తెలియజేశారు. మరణానికి దగ్గరలో ఉన్న వ్యక్తి ఇక కోలుకుంటాడని ఆశ లేని సందర్భాలలో.. సజీవ వీలునామాను రాసుకోవచ్చు. అయితే తనకు వైద్యం చేస్తున్న డాక్టరుకు తను ఆ విషయాన్ని తెలపాలి. ఆ డాక్టరు సహాయంతో జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ వద్ద అభ్యర్థన పెట్టుకోవాలి. సాధారణంగా చికిత్స లేని రోగాలకు, రుగ్మతలకు వర్తించే ఈ తీర్పులో పేర్కొన్న పలు అంశాలను రోగికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్లు తప్పనిసరిగా పాటించాలి.
రోగి చికిత్స పొందుతున్న వైద్యాలయంలో... ఒక బోర్డును ఏర్పాటు చేసి.. అందులో ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరుతో పాటు ఇతర విభాగాలకు చెందిన డాక్టర్లు కూడా ముగ్గురు ఉండేలా చూడాలి. వారు కూడా క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్లో అపార అనుభవం కలిగి ఉండాలి. ఈ బోర్డు ఇచ్చే రిపోర్టుతో పాటు రోగి సంరక్షకుల ఆమోదం కూడా పొందాక.. జిల్లా కలెక్టరుకి విషయాన్ని తెలియజేసి.. ఆయన కూడా ఆయా కేసుకి సంబంధించి ప్రభుత్వం తరఫున పలు వైద్య నిపుణులతో కూడిన ఒక బోర్డును నియామించాక.. వారు రిపోర్టు తయారు చేసి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ వద్దకు పంపించాలి. అన్ని అంశాలను పరిశీలించాక.. మెజిస్ట్రేట్ నిర్ణయం మేరకే తదుపరి కార్యాచరణ ఉంటుంది.
ఒకవేళ ఈ అంశాలు అన్నీ కొలిక్కి వచ్చాక కూడా మెడికల్ బోర్డు.. రోగి వినతిని తోసిపుచ్చితే.. రోగి గానీ రోగి సంబంధీకుల గానీ హైకోర్టుని ఆశ్రయించవచ్చు. అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి ఒక డివిజన్ బెంచీ ఏర్పాటు చేసి.. ఈ కేసును హై ప్రయార్టీ కేసుగా పరిగణించి.. వేగంగా నిర్ణయం తీసుకోమని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. పరోక్ష కారుణ్య మరణానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఇప్పటికే అనేకమంది ప్రముఖ న్యాయవాదులు స్వాగతించారు.