సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే సోనియా గాంధీ ఢిల్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీలకు విందు ఇవ్వనున్నారు. అయితే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే విందుకు హాజరు అవుతాయని కథనాలు వెలువడ్డాయి. అయితే సోనియా గాంధీ నుంచి విందుకు హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ),తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)లకు ఆహ్వానం అందలేదు. శనివారం వరకు వేచి చూసినా రెండు పార్టీలకు ఆహ్వానం అందలేదని సమాచారం.
ఢిల్లీలో మార్చి13 తేదిన అన్ని ప్రతిపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని సోనియా గాంధీ నిర్ణయించారు. వాస్తవానికి, టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ విందుకు హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, తెలంగాణలో టిఆర్ఎస్‌లు కాంగ్రెస్‌కు ప్రత్యర్థులే. ఒకవేళ సోనియా నుండి ఆహ్వానం అందినా కూడా విందుకు హాజరు కాకూడదని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయని సమాచారం.
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో 'మూడవ ఫ్రంట్' ఏర్పాటులో బిజీగా ఉన్నారు.
"కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం వస్తుందని నేను అనుకోను. మేము కూడా కాంగ్రెస్ నుండి ఆహ్వానాన్ని కోరుకోము"అని టీఆర్ఎస్ ఎంపీ ఏ.పీ. జితేందర్ రెడ్డి చెప్పారు. అన్ని పార్టీల విందుకు కాంగ్రెస్ ఆహ్వానిస్తే తాము హాజరుకామని ఆయన అన్నారు.
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కూడా అన్ని పార్టీల విందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని చెప్పారు. ఒకవేళ ఆహ్వానం అందినా కూడా వెళ్లమన్నట్లుగా మాట్లాడారు.