స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ ఇప్పట్లో కష్టమేనా ?

కేసీఆర్-స్టాలిన్ మధ్య భేటీపై వ్యక్తమవుతున్న సందేహాలు

Last Updated : May 7, 2019, 04:28 PM IST
స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ ఇప్పట్లో కష్టమేనా ?

హైదరాబాద్: ప్రస్తుత లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో థర్డ్ ఫ్రంట్‌ని ఏర్పాటు చేసి బీజేపి, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా మరోసారి తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సోమవారం నాడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయిన ఆయన కూటమి ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు. పినరయి విజయన్‌తో భేటీ అనంతరం ఈనెల 13న తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ అవ్వాలని కేసీఆర్ ప్రణాళికలు రచించుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ విషయమై స్టాలిన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. 

ఇదిలావుండగా తాజాగా మీడియాలో వస్తోన్న వార్తా కథనాల ప్రకారం కేసీఆర్‌తో స్టాలిన్ సమావేశం జరగకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండటమే అందుకు కారణమనేది సదరు కథనాల సారాంశం. కేసీఆర్ భావించినట్టుగా ఈనెల 13న కాకుండా త్వరలోనే మరో సందర్భంలో వీళ్లిద్దరి భేటీ అవకాశం ఉందని సమాచారం. అయితే, ఒకవేళ స్టాలిన్‌కు అలా వీలు కాని పక్షంలో.. కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడే ఆ విషయాన్ని కూడా చెప్పి ఉండే వారే కదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్-స్టాలిన్ మధ్య భేటీపై వ్యక్తమవుతున్న సందేహాలపై టీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.

Trending News