పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందగా, ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Two BSF personnel killed in cross-border firing by Pakistan in #JammuAndKashmir's Akhnoor. More details awaited. pic.twitter.com/slYwGVrYvM
— ANI (@ANI) June 2, 2018
మరోవైపు శ్రీనగర్ లో ఉగ్రవాదులు శనివారం గ్రనేట్ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో లోయలో మొత్తం 7 గ్రనేట్ దాడులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు గ్రనేడ్ దాడులకు పాల్పడిన ఘటనలో నలుగురు గాయపడ్డారు.
అటు జమ్మూ కాశ్మీర్‌లోని నౌహట్టా ప్రాంతంలో ఆర్మీ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందటంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. శుక్రవారం ప్రార్థనా మందిరం నుంచి ప్రజలు బయటకు వస్తున్న సమయంలో సీఆర్పీఎస్ వాహనం అటువైపు రావడంతో ఆగ్రహించిన వారు దాడికి ప్రయత్నించారు. దీంతో డ్రైవర్ వాహన వేగం పెంచగా జన సమూహంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ పౌరుడు అక్కడికక్కడే మరణించగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో మరింత కోపోద్రిక్తులైన స్థానికులు వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో శ్రీనగర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్, బుద్గంలలో ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.జమ్మూ కాశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్ శ్రీనగర్ యూనిట్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 20 మందికిపైగా ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు నిఘా సంస్థల నివేదికలు తెలపడంతో కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు.