కోల్కతా: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)లో వెలుగుచూసిన భారీ కుంభకోణం ప్రకంపనలు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు తాకుతున్నాయి. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దెబ్బకు యూకో బ్యాంకు కూడా రూ.2,636 కోట్ల రూపాయలు నష్టపోయింది.
‘‘మా హాంకాంగ్ బ్రాంచ్- పీఎన్‌బీ నుంచి వచ్చిన లెటర్ ఆఫ్ క్రెడిట్ డాక్యుమెంట్‌ను, స్విఫ్ట్ మెసేజ్‌ను పరిశీలించింది. క్లయింట్లలో -పీఎన్‌బీలో మోసానికి పాల్పడ్డవారు (నీరవ్ మోదీ, ఛోక్సీల కంపెనీలు) ఉన్నట్లు తాజాగా తేలింది. సుమారు 411.82 మిలియన్ డాలర్ల (రూ 2636 కోట్ల) మేర చెల్లింపులు చేశాం. ఈ మొత్తాన్ని గ్యారంటీ ఇచ్చిన పీఎన్‌బీ భర్తీ చేస్తుందని ఆశిసున్నాం’’ అని యూకో బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఇప్పటిదాకా పీఎన్‌బీ జారీ చేసిన ఎల్‌ఓయూల వల్ల అలహాబాద్ బ్యాంకు ($336.87 మిలియన్లు), యూనియన్ బ్యాంకు($300 మిలియన్లు) మాత్రమే నష్టపోయాయని భావిస్తున్న కేంద్రానికి యూకో బ్యాంక్ సమాచారంతో మరో షాక్ తగిలింది.