ఢిల్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. అభివృద్ధికి పట్టం కడతామని ప్రజలు తీర్పు ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. అంతా ముందు ఊహించిన విధంగానే ఢిల్లీ ఎన్నికల్లో దేశ రాజధాని ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టినట్లుగా కనిపిస్తోంది. గత ఐదేళ్ల మళ్లీ కావాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే .. ఢిల్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న సంఖ్యాపరంగా చూస్తే .. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 57 స్థానాల్లో దూసుకువెళ్తోంది. గట్టి పోటీ ఇస్తామని ఢిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన బీజేపీ .. కేవలం 13 స్థానాల ఆధిక్యం దగ్గరే ఆగిపోయింది.
ఫలితాలు కాస్త నిరాశజనకంగా ఉండడంతో బీజేపీ ప్రధాన కార్యాలయం అంతా బోసిపోయి కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ తూర్పు ఎంపీ గౌతమ్ గంభీర్.. పూర్తి ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పు శిరసా వహిస్తామని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఐతే ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీనే మళ్లీ కోరుకున్నారని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నామని చెప్పారు.