Karnataka next CM: కర్ణాటకలో బీజేపి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు

Who Will Be Karnataka's Next CM: కర్ణాటక ఎన్నికల్లో బీజేపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై మాలో ఎలాంటి సందేహం లేదని.. నేతలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తున్నాం అంటూ కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోలోపల పెద్ద తతంగమే నడుస్తోంది. 

Written by - Pavan | Last Updated : May 1, 2023, 08:40 PM IST
Karnataka next CM: కర్ణాటకలో బీజేపి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు

Who Will Be Karnataka's Next CM: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో పలుమార్లు అధికారం చేపట్టి, ఇప్పుడు కూడా సర్కారులో ఉన్న బీజేపి ఇంకోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్, వొక్కలిగ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు ఎంతో కీలకం. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ రెండు సామాజికవర్గాలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఈ రెండు సామాజికవర్గాల్లో ప్రస్తుతం బీజేపి అధికంగా లింగాయత్ సామాజికవర్గంపై ఆధారపడుతోంది.  అయితే, రానున్న రోజుల్లో లింగాయత్ సామాజిక వర్గంపై ఎక్కువగా ఆధారపడకుండా, వొక్కలిగ సామాజికవర్గంపై పట్టు పెంచుకునేందుకు బీజేపి ప్లాన్ చేస్తోంది. 

కర్ణాటక రాజకీయాలు ఇంత వేడెక్కుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఒకవేళ కర్ణాటకలో మరోసారి బీజేపి అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరిని వరిస్తుంది అనే అంశంలో బీజేపి హైకమాండ్ డీటేల్స్ లీక్ అవకుండా సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ ఎంతో జాగ్రత్తపడుతోంది. కర్ణాటకలో బీజేపి గెలిస్తే బీజేపి అధిష్టానం బీఎస్ బొమ్మైనే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగిస్తుందా లేక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప లాంటి నేతల పేర్లను పరిశీలిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై మాలో ఎలాంటి సందేహం లేదని.. నేతలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తున్నాం అంటూ కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోలోపల పెద్ద తతంగమే నడుస్తోంది. ఎవరికి తోచిన రీతిలో వారు భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే కర్ణాటకలో ఓటు బ్యాంకు పరంగా బలమైన సామాజికవర్గం పేరున్న లింగాయత్ కమ్యునిటీకి చెందిన అగ్రనేతలు ఇప్పటికే బీజేపి హై కమాండ్ ని కలిసి ముఖ్యమంత్రి పోస్ట్ తమకే ఇవ్వాలని తమ డిమాండ్ ని వినిపించారు. ఎన్నికల కంటే ముందుగానే లింగాయత్ సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఎన్నికల్లో ఆ సామాజికవర్గం ఓట్లతో మరోసారి అధికారంలోకి రావచ్చని.. లేదంటే రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు తప్పవేమోనని బీజేపి హై కమాండ్ కి చెప్పకనే చెప్పేశారు.     

వొక్కలిగ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా సిటి రవి ఉన్నారు. సి.టి. రవి ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తనకే ఇవ్వాలని సి టి రవి ఆశిస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని బీజేపి అధిష్టానం ముందుంచినట్టు సమాచారం. మాజీ మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. అయితే, ఎవరు ఎన్నిరకాలుగా లాబీయింగ్ చేసినా.. ఎన్ని డిమాండ్స్ వినిపించినా.. బీజేపి హై కమాండ్ మాత్రం ఏ సమాధానం చెప్పకుండా సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ వస్తోంది.  

ఇదిలావుంటే, వివిధ సందర్భాల్లో బీజేపి అగ్రనేతలు చేసిన కామెంట్స్ బీజేపి క్యాడర్‌లో పలురకాలుగా పరోక్ష సంకేతాలు ఇచ్చింది. యడియూరప్ప గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటయ్యే కర్ణాటక సర్కారు యడియూరప్ప ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజ్ నాథ్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ యడియూరప్పనే బీజేపి హైకమాండ్ తరువాతి ఛాయిస్ అనే సంకేతాలిచ్చింది. 

అలాగే బసవరాజ్ బొమ్మై నామినేషన్ సందర్భంగా జేపి నడ్డా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు.. రాబోయే ఐదేళ్లపాటు బిఎస్ బొమ్మైనే కర్ణాటక ముఖ్యమంత్రి అనే సంకేతాలిచ్చారు. ఇక కర్ణాటక మాజీ మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప మాట్లాడుతూ.. వొక్కలిగ సామాజికవర్గాన్ని ప్రభావితం చేయగలిగిన సామర్థ్యం ఉన్న నాయకుడు సి టి రవి అని.. చికమంగళూరును ఆయన బాగా అభివృద్ధి చేశారని అన్నారు. అందుకే సి టి రవికి ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పే స్థాయిలో తాను లేను కానీ అని అంటూనే వొక్కలిగ సామాజికవర్గం డిమాండ్‌నికే ఎస్ ఈశ్వరప్ప అధిష్టానం ముందు పెట్టారు.

Trending News