వాట్సాప్ ద్వారా భార్యకు త్రిపుల్ తలాక్.. చేతులెత్తేసిన పోలీసులు

వాట్సాప్ ద్వారా భార్యకు త్రిపుల్ తలాక్.. చేతులెత్తేసిన పోలీసులు

Last Updated : Sep 19, 2019, 04:23 PM IST
వాట్సాప్ ద్వారా భార్యకు త్రిపుల్ తలాక్.. చేతులెత్తేసిన పోలీసులు

శివమొగ్గ: వాట్సాప్ వాయిస్ మెస్సేజ్ ద్వారా తన భర్త తనకు త్రిపుల్ తలాఖ్ చెప్పాడని ఫిర్యాదు చేస్తూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించిన ఘటన బుధవారం నాడు కర్ణాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. దుబాయ్‌లో ఉంటున్న తన భర్త ముస్తాఫా బేగ్ వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా తనకు త్రిపుల్ తలాక్ చెప్పాడని పోలీసుల ఎదుట వాపోయిన బాధిత మహిళ.. తాను ఈ విడాకులకు అంగీకరించబోనని స్పష్టంచేశారు. అంతేకాకుండా తనకు న్యాయం జరిగే వరకు తన భర్తపై న్యాయ పోరాటం చేస్తానని తేల్చిచెప్పారామె. పోలీసులను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం బుధవారం రాత్రి బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ముస్తఫా బేగ్ దుబాయ్‌లో ఉంటున్నందున ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేస్తున్నారని మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు.

శివమొగ్గలో ల్యాప్ టాప్, సీసీ కెమెరాల టెక్నిషియన్‌గా పనిచేసిన ముస్తఫా బేగ్‌తో తనకు 20 ఏళ్ల క్రితమే వివాహమైందని.. కొంతకాలం క్రితమే జీవనోపాధి కోసం తనను, పిల్లలను విడిచి అతను దుబాయ్ వెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం వరకు నెలకు రూ.13,000 పంపించిన తన భర్త.. ఇటీవల కాలంలో ఫోన్ చేయడం, డబ్బులు పంపించడం మానేశాడని.. ఇప్పుడు ఏకంగా త్రిపుల్ తలాక్ చెప్పాడని బాధితురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

Trending News