అర్చన తిమ్మరాజు.. పుట్టుకతోనే మూగ, చెవిటి అమ్మాయి. అయితేనేం.. సాహస యాత్రలు చేయడంలో ఆమెకు ఆమే సాటి. 33 ఏళ్ల ఈ ఉపాధ్యాయురాలు బైక్ మీద లేహ్ ప్రాంతం నుండి బెంగళూరు వరకు ప్రయాణించి (దాదాపు 8300 కిలో మీటర్లు) అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పూణె, అహ్మదాబాద్, జైసల్మేర్, అమృత్సర్, శ్రీనగర్, కార్గిల్, చండీగఢ్, న్యూఢిల్లీ, నాగపూర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రయాణించి రికార్డు సాధించింది.
హైదరాబాదులో పుట్టి పెరిగిన అర్చన.. బెంగళూరులోని సెయింట్ జాన్స్ స్కూలులో చదువుకుంది. కర్ణాటక చిత్రకళా పరిషత్ నుండి ఫైన్ ఆర్ట్స్ చేసిన ఆమె ప్రస్తుతం ఆదితి మాల్య ఇంటర్నేషనల్ స్కూలులో ఆర్ట్ టీచరుగా ఉద్యోగం చేస్తోంది. తాను రికార్డు సాధించడానికి చేసిన ప్రయాణంలో ఆమె తన తోటి ఉద్యోగి అయిన డేనియల్ సుందరం సహాయం తీసుకుంది. అర్చన రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతుండగా.. డేనియల్ కేటీఎం బైక్ నడుపుతూ ఈ ప్రయాణాన్ని కొనసాగించారు.
ఇలాంటి యాత్రలు అర్చనకు కొత్తేమీ కాదు. ఆమె ఇప్పటికే "సైలెంట్ ఎక్స్‌పిడీషన్" అని దివ్యాంగులైన బైక్ రైడర్ల కోసం ప్రత్యేకంగా సంస్థను స్థాపించారు. ఇలాంటి సాహస యాత్రలు ఎవరైనా చేయవచ్చని.. అయితే సేఫ్టీ గేర్‌తో పాటు అవసరమైన ఎక్విప్మెంట్ కచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలని అంటున్నారు అర్చన. 21 ఏళ్ళకు తొలిసారిగా తాను బైక్ నడపగలిగానని.. ఆ తర్వాత తనలాంటి మహిళలలో ప్రేరణను నింపడం కోసం ఇలాంటి సాహస యాత్రలకు శ్రీకారం చుట్టానని ఆమె తెలిపారు.