Minister Singireddy Niranjan Reddy: తనకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Singireddy Niranjan Reddy: కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, ఏదో రంధ్రాన్వేషణ చేసినట్లు తొలుత భూములు కొని ఎస్టీల పేరు మీదకు.. ఆ తర్వాత మంత్రి కుటుంబసభ్యుల పేరు మీదకు వెళ్లాయని రఘునందన్ రావు ఆరోపించారు. కానీ దానివెనుకున్న అసలు వాస్తవం వేరే ఉంది అంటూ రఘునందన్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Written by - Pavan | Last Updated : Apr 19, 2023, 04:21 AM IST
Minister Singireddy Niranjan Reddy: తనకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి

Minister Singireddy Niranjan Reddy: బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మా స్వగ్రామం పానగల్‌లో నాకు ఉన్న భూముల వివరాలన్నీ 2014, 2018 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నవే. ఆ వ్యవసాయ క్షేత్రంలో నా సతీమణి సొంత డబ్బులు, బ్యాంకు లోనుతో నిర్మించుకున్న ఇల్లు. విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మేజర్లు అయిన మా ఇద్దరు అమ్మాయిలు స్వార్జితంతో చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుండి, ఇతరుల నుండి చట్టబద్దంగా భూములు ఖరీదు చేశారు. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారు అని రఘునందన్ రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, ఏదో రంధ్రాన్వేషణ చేసినట్లు తొలుత భూములు కొని ఎస్టీల పేరు మీదకు.. ఆ తర్వాత మంత్రి కుటుంబసభ్యుల పేరు మీదకు వెళ్లాయని రఘునందన్ రావు ఆరోపించారు. కానీ దానివెనుకున్న అసలు వాస్తవం వేరే ఉంది అంటూ రఘునందన్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

రఘునందన్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ.. " తల్లితండ్రులను కోల్పోయిన గౌడ నాయక్‌ అనే పసిబాలుడిని నేనే చేరదీసి ఇంట్లో పెట్టుకుని, పెంచి పెద్దచేసి, ఉన్నత చదువులు చదివించిన విషయం వనపర్తి నియోజకవర్గం అంతా తెలుసు. తను మా కుటుంబంలో ఒకడిగా ఉంటాడు. ప్రస్తుతం మా ఇంటి వ్యవహారాలు చూసుకునేది కూడా అతడే. ఆ భూములు కొన్న వారితో అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితులలో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్ట్రేషన్ చేసి.. ఆ తర్వాత పిల్లల పేరు మీదకు మార్చుకోవడం జరిగింది " అని తెలిపారు. 

కనీస సమాచారం కూడా లేకుండానే రఘునందన్ రావు గుడ్డిగా ఆరోపణలు చేయడం అవివేకం. దురుద్దేశపూర్వకంగా నాపై చేసిన ఆరోపణలకు చట్టపరంగా సమాధానం ఇస్తా. మూడు ఫామ్ హౌజ్‌లు ఉన్నాయని ప్రచారం చేయడం అవివేకం. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌజ్‌లుగా కనిపిస్తే అది నీ అజ్ఞానానికి నిదర్శనం. పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి అని ఆరోపించారు. కానీ అది వెల్టూరు గ్రామ పరిధిలోది. లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న నా సొంత మరదలు కవిత, వారి స్నేహితులకు అక్కడ ఉన్న భూమి 11.20 ఎకరాలు మాత్రమే. అక్కడ ఫాంహౌజ్ లేదు. కూరగాయల తోటలు ఉన్నాయి. రఘునందన్ రావు ఆరోపించినట్టుగా ప్రభుత్వం నుండి ఆ భూమికి ఎలాంటి రహదారి మంజూరు కాలేదు. వారు ఇక్కడ ఉండరు కాబట్టి అప్పుడప్పుడు స్వయంగా నేనే వెళ్లి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తుంటాను అని తెలిపారు.

ఈ మూడు వ్యవసాయ క్షేత్రాలకు రఘునందన్ రావుకు నచ్చినవాళ్లతో, నచ్చిన సర్వేయర్‌ను తీసుకుని రేపే వెళ్లొచ్చు. లేదా, ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి సర్వే చేయించుకోవడానికి అంగీకరిస్తున్నాను. న్యాయంగా చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా.. ఆ భూములను మా పిల్లలు వదిలేస్తారు. నేను నా పదవికి రాజీనామా చేస్తాను. లేకుంటే నువ్వు అక్కడే నీ పదవికి రాజీనామా చేసిపోవాలి అని రఘునందన్ రావుకు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. 

మానోపాడు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనను ఈ భూములకు ముడిపెట్టడం నీచపు ఆరోపణ. జుగుప్సాకరం.. రికార్డులు మండలస్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో, సీసీఎల్ఎలో కూడా ఉంటాయి. ఒకచోట రికార్డులు లేకుంటే మరో కార్యాలయంలో ఉంటాయన్న కనీస పరిజ్ఞానం లేకపోతే ఎలా ? అని తనపై అవినీతి ఆరోపణలు చేసిన రఘునందన్ రావును మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రఘునందన్ రావును ఎవరు ఆడిస్తున్నారో మాకు తెలుసు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు వేర్వేరు కాదు. రెండు ఒక తానులోని ముక్కలే. వారి ఎజెండా, కార్యాచరణ ఒక్కటే అని ప్రజలకు తెలుసు అని మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఎన్నో ప్రయత్నాలు చేసి, నా నియోజకవర్గంలో కొందరిని లోబర్చుకుని, నాకు వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టారు. రాజకీయంగా నన్ను ఎదుర్కునే శక్తి లేకే నాపై ఇలా బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారు. గత ఎన్నికలలోనూ ఇటువంటి ప్రచారమే చేశారు. ఇప్పుడు అదే మొదలుపెట్టారు అని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 40 ఏళ్ల న్యాయవాద వృత్తిలో, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు పాల్పడలేదు అని అన్నారు. 

ఇది కూడా చదవండి : BJP MLA Raghunandan Rao: కృష్ణా నది తీరం కబ్జా చేసి.. 165 ఎకరాల్లో మంత్రి ఫామ్ హౌజ్..

చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండు..
తాను ఇలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడే రకం కాదు. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించి ప్రజల్లో అభాసుపాలు చేయాలనుకోవడం అవివేకమే అవుతుంది. రఘునందన్ రావు తనను తాను ఎక్కువ ఊహించుకుని ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తే ఇక్కడ భరించడానికి ఎవరూ సిద్దంగా లేరు అని మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. 1985 నుండే ఆదాయపు పన్ను చెల్లించిన న్యాయవాదిని నేను. స్థాయిని మించి మాట్లాడేటప్పుడు రఘునందన్ రావు అవతలి వారి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. నిజానిజాలు తెలుసుకోకుండా రాజకీయ దుగ్దతో చేసిన ఆరోపణలకు రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని రఘునందన్ రావును హెచ్చరించారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఈ వివరణపై, చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.

ఇది కూడా చదవండి : Teenmar Mallanna New Party: జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న.. కొత్త పార్టీ పేరు ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News