Terrorist Movements in Tirumala: తిరుమలలో సోమవారం రాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తంచేస్తూ ఓ వ్యక్తి తిరుమల పోలీసులకు ఈమెయిల్ చేశారు. రెండు ప్రదేశాలకు సంబంధించిన గూగుల్ మ్యాప్స్ ని అటాచ్ చేసిన సదరు వ్యక్తి.. ఆ ప్రదేశాల్లో తనిఖీలు చేయాల్సిందిగా కోరాడు. ఉగ్రవాదుల కదలికలపై ఈ మెయిల్ రిసీవ్ చేసుకున్న పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టి తిరుమలకు వచ్చి వెళ్లే భక్తులు, ఇతర వ్యక్తుల లగేజీలను క్షణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు.
అయితే, తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు లేవని నిర్ధారించుకోవడంతో పాటు ఆ వ్యక్తి పంపించిన ఈమెయిల్ కూడా ఫేక్ అని ఒక నిర్ధారణకు వచ్చిన తిరుమల పోలీసులు.. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ ఓ ప్రకటన సైతం విడుదల చేశారు.
తిరుమలలో ఉగ్రవాదుల కలకలం ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి స్పందిస్తూ.. ఆధ్యాత్మిక నగరమైన తిరుమలలో ఉగ్రవాదుల కలకలం అసత్యం అని స్పష్టంచేశారు. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్ పంపించారని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా అది ఫేక్ ఈ మెయిల్ అని తేలిందన్నారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవని ఎస్పీ పరమేశ్వర రెడ్డి తేల్చిచెప్పారు. తిరుమలకు వచ్చే భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు, అవాస్తవాలు నమ్మకండి అంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో నిరంతరం తమ సిబ్బంది.. పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు అని స్పష్టంచేశారు. అనునిత్యం పోలీసు పహారాలో ఉండే తిరుమలలో అసాంఘిక శక్తులు ప్రవేశించినట్టు వచ్చిన బెదిరింపు ఈమెయిల్ ఫేక్ అని గుర్తించామని.. అయినప్పటికీ పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తిరుపతి జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి తెలిపారు. ఫేక్ బెదిరింపు ఈమెయిల్ రాకతో తనిఖీలు చేపట్టడంతో తిరుమలలో ఒకింత హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఏదేమైనా ఆ బెదిరింపు ఈమెయిల్ ఫేక్ అని తేలడంతో భక్తులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.