అఖిల భారతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం, మంగళవారం రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీకి చెందిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యాక తొలిసారి రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు.
రాహుల్ రెండు రోజుల పర్యటన వివరాలు
సోమవారం మధ్యాహ్నం రాహుల్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. పర్యటనలో భాగంగా మహిళా సంఘాలతో భేటీకానున్నారు. అనంతరం సాయంత్రం శేరిలింగంపల్లి బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి హోటల్ హరితప్లాజాలో రాహుల్ బస చేస్తారు.
మంగళవారం ఉదయం బూత్ కమిటీల అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అనంతరం సీనియర్ నేతలతో,ఎడిటర్లతో,పారిశ్రామికవేత్తలతో వివిధ సమయాల్లో వేర్వేరుగా సమావేశమవుతారు. మధ్యాహ్నం గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి.. సాయంత్రం విద్యార్థులు, యువజన సంఘాలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌లో రాహుల్‌గాంధీ సభ జరగనుంది. అనంతరం రాత్రి 7.30 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లికి వెళ్లనున్నారు.
గతేడాది జూన్‌లో ప్రజాగర్జనలో పాల్గొన్న రాహుల్.. రానున్న ఎన్నికలే లక్ష్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా వివిధ వర్గాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, హాకీ మైదానంలో, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పార్టీ పలు కార్యక్రమాలు రూపొందించినా అనుమతి రాకపోవడంతో.. ఆ మూడు కార్యక్రమాలు రద్దయ్యాయి.