వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేస్తుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం ముగిశాక.. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులపై వార్తాపత్రికల్లో ఈ మధ్య ఊహాగానాలు ఎక్కువవుతున్నాయని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులుండవని.. ఇది పార్టీ ఏకగ్రీవ నిర్ణయమన్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు కోసం తన ప్రయత్నం ఆగదని కేసీఆర్ అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం తీసుకొచ్చిన 'ఫెడరల్ ఫ్రంట్/థర్డ్ ఫ్రంట్' కచ్చితంగా ఏర్పడుతుందని.. అందుకోసం కృషి చేస్తున్నామన్నారు. కేంద్రం బీసీ వర్గాల కోసం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాక ఏంచేశామో చెప్పడం కోసం సెప్టెంబర్ 2న హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు సమీపంలో 1500 ఎకరాల్లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని చెప్పారు.
రాహుల్ అసత్య ప్రచారం
తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. హామీ ఇచ్చినట్టుగానే దాదాపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, పేదవాళ్లకి ఇళ్లను కట్టిచ్చి ఇస్తున్నామని చెప్పారు. సర్వేల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 100కు పైగా స్థానాల్లో గెలుస్తుందని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో తెలిపారు.