తమిళంలో స్టార్ హీరో విజయ్ దళపతి, స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో 2014లో రిలీజైన కత్తి సినిమా అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. విజయ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాను ఆ తర్వాత 2015లో ప్రముఖ తెలుగు దర్శకుడు వి.వి.వినాయక్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. మెగాస్టార్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. అయితే, తాజాగా ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయిన కత్తి సినిమాను హిందీలోనూ రీమేక్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు ఓ ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్. అవును, బాలీవుడ్‌లో దేవదాస్, రౌడీరాథోడ్, మేరీకోమ్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కత్తి హిందీ రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గతంలో ఇదే సంజయ్ లీలా భన్సాలీ తమిళంలో ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన రమణ (తెలుగులో ఠాగూర్) సినిమా హిందీ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి నిర్మించిన సంగతి తెలిసిందే. ''గబ్బర్ ఈజ్ బ్యాక్'' పేరిట తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు దర్శకుడు కృష్ డైరెక్ట్ చేశాడు. అంతకన్నా ముందుగా రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కుడు సినిమా హీందీ రీమేక్ రైట్స్ కొన్న సంజయ్ లీలా భన్సాలీ ఆ చిత్రాన్ని ''రౌడీ రాథోడ్'' పేరిట ప్రభు దేవా దర్శకత్వంలో నిర్మించాడు.
అయితే, తాజాగా కత్తి హిందీ రీమేక్ రైట్స్ కొన్న ఈ దర్శకుడు ఈ సినిమాను తానే డైరెక్ట్ చేస్తాడా లేక గతంలో మాదిరిగా మరెవరి చేతిలోనా పెడతాడా అనే వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. అంతేకాకుండా కత్తి రీమేక్‌లో నటించబోయే హీరో, హీరోయిన్స్ ఎవరనే వివరాలపై సైతం ఇంకా స్పష్టత లేదు.