MLA Etala Rajender House Arrest in Hyderabad: తెలంగాణలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు బాటసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లేందుకు బీజేపీ నేతలు సిద్ధమవ్వగా.. ఈ నేపథ్యంలో హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బాటసింగారంలో ఎనిమిదేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాలు అసంపూర్తిగా ఉన్నాయని బీజేపీ నేతలు అన్నారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది.
తమకు అరెస్టులు కొత్తేమి కాదని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. "బాటసింగారం వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇవాళ పరిశీలించాలని బీజేపీ నిర్ణయించింది. కానీ, నాతో సహా జంటనగరాల్లో ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రతీసారి అధికార పార్టీకి ఇది అలవాటుగా మారింది. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉంది.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత మాపై ఉంటుంది. కానీ, కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మమ్ముల్ని నిర్బంధించినంత మాత్రాన మా పోరాటం ఆగదు. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. అరెస్టులు మాకేం కొత్తకాదు. మీ తీరు మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని మార్చడం ఖాయం. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న మీకు వారే తగిన బుద్ధి చెప్తారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా.." అని ఆయన అన్నారు.
బీజేపీ నేతల అరెస్ట్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకోసం గొప్పగా కట్టామని చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూడడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకు..? అని ప్రశ్నించారు. ఇదేమైనా ఉద్యమమా..? లేక తిరుగుబాటా..? అని అడిగారు. కేవలం ఇండ్లు చూడడానికి వెళ్తుంటే భయమెందుకు అని అడిగారు. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైందని.. బీఆర్‌ఎస్‌ను గద్దెదించే వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. హౌస్ అరెస్టులు అక్రమ అరెస్టులు బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వనికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"గొప్పగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తే ఈ అక్రమ అరెస్టులెందుకు..? బాటసింగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసేందుకు పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. బీజేపీ నేతలను ముందస్తు అరెస్టులు చేయడం.. గృహానిర్బంధం చేయడం దుర్మార్గం. రెండేళ్ళల్లో ప్రగతి భవన్ నిర్మించుకున్న కేసీఆర్.. 9 ఏళ్ళైనా పేదల డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణం మాత్రం జరగలేదంటే పేదల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుంది.." అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: Manipur Violence: మణిపూర్‌లో భయంకరమైన వీడియో.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. దారుణం..!
Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
MLA Etala Rajender Arrest: తాటాకు చప్పుళ్లకు భయపడం.. హౌస్ అరెస్ట్‌పై ఈటల రియాక్షన్