Who is Madhya Pradesh Next CM: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులు అవుతున్నా.. మధ్యప్రదేశ్‌లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సోమవారం బీజేపీ అధిష్టానం ఉత్కంఠకు తెరదించే అవకాశం ఉంది. కేంద్ర పరిశీలకుల సమక్షంలో సోమవారం జరిగే సమావేశంలో కొత్తగా ఎన్నికైన 163 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఎన్నికల పోలింగ్ జరిగింది. గత ఆదివారం (డిసెంబర్ 3) ఫలితాలు వెలువడగా.. బీజేపీ 163 స్థానాలను గెలుచుకుని తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 66 స్థానాలతో ప్రతిపక్షానికే పరితమైంది. సోమవారం సాయంత్రం 7 గంటలకు బీజేపీ శాసనసభ్యుల సమావేశాన్ని నిర్వహించనుంది. మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శాసనసభా పక్ష సమావేశం తేదీకి సంబంధించిన సమాచారాన్ని అందించారు. డిసెంబర్ 11న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుందని.. పార్టీ కేంద్ర పరిశీలకులు రాష్ట్రానికి వస్తారని చెప్పారు.
బీజేపీ మీడియా సెల్ హెడ్ ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ముందుగా ఆదివారం ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలని భావించామని.. అయితే కేంద్ర పరిశీలకుల బిజీ షెడ్యూల్ కారణంగా సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం మధ్యప్రదేశ్‌కు పరిశీలకులు చేరుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయన్నారు. గత 19 ఏళ్లలో మధ్యప్రదేశ్‌కు కేంద్ర పరిశీలకులని బీజేపీ పంపడం ఇది మూడోసారి.
2004 ఆగస్టులో ఉమాభారతి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సందర్భంలో పార్టీ సీనియర్ నాయకులు ప్రమోద్ మహాజన్, అరుణ్ జైట్లీలను కేంద్ర పరిశీలకులుగా రాష్ట్రానికి పంపారు. ఆ తరువాత నవంబర్ 2005లో బాబూలాల్ గౌర్ రాజీనామా చేయగా.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ఎమ్మెల్యేలకు రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్ర పరిశీలకుడిగా వచ్చారు. ఆ సమయంలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుతం కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండగా.. ఎన్నికల ముందు మాత్రం ఆయన పేరును ప్రకటించలేదు. ఎన్నికల్లో విజయం అనంతరం కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. ప్రతిసారి మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించేది. కానీ గత 20 ఏళ్ల తర్వాత తొలిసారి సీఎం ఎవరు అని ప్రకటించకుండా అసెంబ్లీ ఎన్నికలకు దిగింది.
శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) నేతపై బీజేపీ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. లోధీ సామాజికవర్గం నుంచి ప్రహ్లాద్ పటేల్ ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. నర్సింగపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన ఆయన ఇటీవల కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. లోధి ఓబీసీ కమ్యూనిటీలో భాగం. మధ్యప్రదేశ్‌లో ఓబీసీ జనాభా 48 శాతానికి పైగా ఉన్నందున ఆయనవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం అచితూచి అడుగులు వేస్తోంది. ఆయనతోపాటు కైలాష్ విజయవర్గియా, వీడీ శర్మ రేసులో ఉన్నారు. డిమాని నుంచి ఎన్నికై కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన నరేంద్ర తోమర్ పేరు కూడా వినిపిస్తోంది. సోమవారం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరో తేలిపోనుంది. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులను ప్రకటించాల్సి ఉంది.
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి