టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి. బాబుమోహన్ శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీలో చేరేందుకు బాబుమోహన్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బాబుమోహన్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆంథోల్ నుంచి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బాబుమోహన్ బీజేపీలో చేరినట్లు సమాచారం.
ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో ఆంథోల్ నియోజకవర్గ టిక్కెట్టును బాబుమోహన్ కోల్పోయారు. 2014ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరిన బాబుమోహన్ ఆంథోల్ నియోజకవర్గ పార్టీ టిక్కెట్టు పొందారు. 2014లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సి.దామోదర్ రాజనర్సింహపై బాబుమోహన్ గెలుపొందారు. కారణాలేమైనప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అభివృద్ది, సంక్షేమ పనులను అమలు చేయించడంలో చురుకుగా వ్యవహరించలేకపోయారని, పార్టీ నాయకులతోనూ సఖ్యతగా లేరని.. ఇటువంటి పరిస్థితులలో రానున్న ఎన్నికలలో బాబుమోహన్ విజయం సాధించడం కష్టమని కేసీఆర్ నిర్వహించిన సర్వేలో తేలినట్లు.. అందుకే బాబుమోహన్‌కు టికెట్టు కోల్పోయినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.