హైదరాబాద్: అతిలోక సుందరీ శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. ఇది శ్రీదేవి బయోపిక్ అనుకుంటే పొరబడినట్లే. క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమైన పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసుకుంటన్న దర్శక, నిర్మాతలు.. శ్రీదేవి పాత్రలో తీవ్ర కసరత్తు చేసి రకుల్ ప్రీత్ ను ఎంపిక చేశారట. అనంతరం రకుల్ ప్రీత్ ను సంప్రదించారట.
కాదనలేక ఓకే చెప్పిన ముద్దుగుమ్మ
బాలీవుడ్ షూటింగులో ఆమె బిజీగా ఉన్నప్పటికీ శ్రీదేవి పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందట.. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ పది రోజులను కేటాయించినట్లు సమాచారం. శ్రీదేవికి గల క్రేజ్ కు రకుల్ కి గల ఇమేజ్ జత చేస్తే ప్రేక్షకులు ఆకట్టుకోవచ్చనే ఆలోచనతో చిత్ర యూనిట్ రకుల్ ప్రీత్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా.. చంద్రబాబునాయుడు పాత్రలో రానా , అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తున్నారు. మిగిలిన నటి నటులను ఎంపిక చేయాల్సి ఉంది.