జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగ్గంపేట బహిరంగ సభలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దుక్కి దున్నే ఎద్దులు కొట్టుకుంటే.. దూడ కాళ్లు విరిగాయి అని ఆయన సామెత చెబుతూ.. టీడీపీ, బీజేపీ కుమ్ములాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుందని తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు కలిసి అన్యాయం చేశాయి. 1997లో కాకినాడలో బీజేపీవాళ్లు ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేశారు. అప్పుడే మన నాయకులు సిగ్గుపడాల్సింది. మా రాష్ట్రాన్ని విడదీయడానికి మీరెవరు అని వారు అప్పుడు ప్రశ్నించలేదు. నాకు బీజేపీ అంటే చాలా కోపం, విసుగు వస్తున్నాయి.
రాష్ట్ర విభజన సమయంలో రెండు జాతీయ పార్టీలు కలిసే పనిచేశాయి. 2014 ఎన్నికల ముందు గాంధీనగరులో మోదీ గారిని కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వివరించి న్యాయం చేయమని కోరాను. ఆయన చేస్తారని నమ్మాను. కానీ చేయలేదు" అని తెలిపారు. విభజన చర్చల్లో టీడీపీ ఎంపీలైన కొనకళ్ల నారాయణను, శివప్రసాద్‌ని రక్తాలు వచ్చేటట్లు ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలు కొట్టారని.. అయినా సిగ్గులేకుండా చంద్రబాబు, రాహుల్‌ని కలుస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎప్పుడూ కలిసిరాలేదని పవన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు, జగన్‌కు మోదీ అంటే భయమని.. అందుకే నిలదీసి మాట్లాడలేకపోతున్నారని.. కానీ తనకు ఆ భయం లేదని.. సొంత అన్నయ్యనే ఎదిరించి బయటకు వచ్చి పార్టీ పెట్టిన తాను ఎవరికీ భయపడేది లేదని పవన్ తెలిపారు. నేడు ఏపీలో అవినీతి చేస్తు్న్న పారిశ్రామికవేత్తలను చూసి సీఎం భయపడుతున్నారని.. అందుకు కారణాలు బయటపెట్టాలని జనసేన డిమాండ్ చేస్తుందని పవన్ వ్యాఖ్యానించారు.