తెలంగాణ పర్యటనలో చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో స్నేహపూర్వక ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మహాకూటమి గెలిస్తే అలాంటి స్నేహపూర్వక వాతావరణ వస్తుందన్నారు. హైదరాబాద్, అమరావతి అన్నదమ్ముల వంటివని... రెండు నగరాలూ మరింతగా అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు. ఇది సాధ్యపడాలంటే మహాకుటమికి ఓటు వేయాలని చంద్రబాబు తెలంగాణ ప్రజలను కోరారు.
కలిసి పనిచేద్దామని పిలిచినా కేసీఆర్ రాలేదు
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఆపధార్మముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కలిసుందామని తాను కేసీఆర్ కు ఎంతో నచ్చజెప్పానని .. తన మాటలను ఆయన బేఖాతరు చేస్తూ వివాదాలతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కనీసం విభజన హామీలపై కేంద్రానికి నిలదీద్దామని తాను ఎన్నిమార్లు చెప్పినా కేసీఆర్ వినలేదన్నారు. విభజన హామీల కోసం తాను ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లానని.. కేసీఆర్ ఒక్కసారి కూడా తనతో కలసి ఢిల్లీకి రాలేదని చంద్రబాబు ఆరోపించారు.
మోడీకి చంద్రబాబు సవాల్...
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోడీ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి మరెక్కడా లేదన్నారు. ఇది తాను తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధపడిందన్నారు.. ఒక్కసారి నరేంద్ర మోదీ అభివృద్ధి చేశానని చెప్పుకునే అహ్మదాబాద్, గాంధీనగర్ లను హైదరాబాద్, సైబరాబాద్ లను పోల్చి చూడాలని సవాల్ విసిరారు. నిరంతరం కృషితోనే హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకుందని..అలాంటి ప్రయత్నమే అమరావతి విషయంలో చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.