న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించాలని తాను కల్లో కూడా ఊహించుకోలేనని సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వర రావు అన్నారు. ఇటీవల ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి ఏ.కే. శర్మను కోర్టు అనుమతి లేకుండా అక్కడి నుంచి బదిలీ చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఏ.కే. శర్మ బదిలీ వ్యవహారంలో కోర్టు ధిక్కరణ నేరం కింద నాగేశ్వర రావును మందలిస్తూ ఆయనను తమ ముందు హాజరు కావాల్సిందిగా సుప్రీం కోర్టు ఫిబ్రవరి 7న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీం ఆదేశాల మేరకు సోమవారం ధర్మాసనం ఎదుట హాజరైన నాగేశ్వర రావు.. సీబీఐ అధికారి బదిలీ వ్యవహారంలో తప్పు జరిగిందని అంగీకరిస్తూ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించాలని తాను కల్లో కూడా అనుకోలేదని, సీబీఐ అధికారిని అక్కడి నుంచి ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయలేదని కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈమేరకు సుప్రీం కోర్టులో నాగేశ్వర రావు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు.