హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీలోకి వలసలు, చేరికలు మరింత జోరందుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాలో టీడీపికి షాక్ ఇస్తూ తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేతల్లో ఒకరైన ఆదాల ప్రభాకర్ రెడ్డి నేడు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం ఆదాలా ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. '' వైఎస్సార్సీపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉంది'' అని అన్నారు. పార్టీ మారడం వెనుక చాలా కారణాలే వున్నాయన్న ఆయన.. ఆ వివరాలన్ని రేపు నెల్లూరులో వెల్లడిస్తానని తెలిపారు. తనను నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీచేయమన్నారని.. తాను కూడా అందుకు సిద్ధంగానే వున్నానని ఆదాల స్పష్టంచేశారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యం అని ఆదాల పేర్కొన్నారు.
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా నేడు వైస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం వంగా గీత మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ తీసుకురానున్న నవరత్నాల ద్వారా అన్నివర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతాయని అభిప్రాయపడ్డారు.