తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సేవలు తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా జరగనున్నాయి. ఇప్పటివరకు ఈ సేవలు సంబధిత రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మాత్రమే జరిగేవి. ఇకపై అలా కాకుండా ఎమ్మార్వోలకు కూడా రిజిస్ట్రేషన్ బాధ్యతలను కట్టబెట్టేలా చట్ట సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలను యధావిధిగా కొనసాగిస్తూనే రిజిస్ట్రేషన్ కార్యా లయాలు లేని ప్రాంతాల్లో ఈ ప్రయత్నం ప్రారంభించాలని టి. సర్కార్ యోచిస్తోంది. 584 మండలాలకుగానూ 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలే ఉండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి మండలానికో రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కొత్తగా ఏర్పాటు చేసే రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రార్లుగా మండల రెవెన్యూ అధికారికే అదనపు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అవినీతికి, జాప్యానికి అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ విభాగంలో పారదర్శకతకు ఇది భీజం కానుందని సర్కార్ భావన. తద్వారా ఎప్పటికప్పుడు భూముల క్రయవిక్రయాలు ఆన్లైన్ లో అప్డేట్ అవుతాయి. అన్ని రెవెన్యూ కార్యా లయాల్లో భూ రికార్డుల నిర్వహణకు కోర్ బ్యాంకింగ్ తరహాలో 1000 మంది ఐటీ అధికారులను నియమించే కసరత్తు కూడా వేగవంతమవుతోంది.