ఢిల్లీ: త్రిపుల్ తలాఖ్ బిల్లుకు విషయంలో మోడీ సర్కార్ తన పంతం నెగ్గించుకుంది. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసున్నప్పటికీ పట్టుబట్టి మరి రాజ్యసభలో బిల్లును ఆమోదించుకున్నారు.ఈ క్రమంలో నిర్వహించిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. లెక్కింపు అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
ఇక మిగిలింది రాష్ట్రపతి ఆమోదమే
ఇటీవలే లోక్ సభలో కూడా ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. ఉభయసభల్లో ఈ బిల్లుకు అడ్డంకులు తొలగిపోవడంతో ట్రిపుల్ తలాఖ్ రద్దుకు లైన్ క్లియర్ అయింది. ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభిస్తే దేశంలో ట్రిపుల్ తలాఖ్ రద్దు కానుంది.
వీగిపోయినా విపక్షాల సవరణలు
త్రిపుల్ తలాఖ్ బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు దీనిపై అనేక అభ్యంతరాలు తెలిపిన ప్రతిపక్ష సభ్యులు దీన్ని సెలక్ట్ కమిటీ పంపాలని సూచించారు. ప్రతిపక్షాల అభ్యర్థన మేరకు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలా? లేదా? అనే అంశంపై సభలో ఓటింగ్ నిర్వహించగా.. సెలెక్ట్ కమిటీ పంపాల్సిన అవసరం లేదని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తూ విపక్షాలు అందజేసిన తీర్మానాలు కూడా వీగిపోయాయి.
అనూహ్య పరిణామాలు
రాజ్యసభలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన త్రిపుల్ తలాక్ బిల్లుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ,రాష్ట్రీయ జనతాదళ్ , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్షాలుతో ఇతర చిన్న పార్టీలు ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. తలాక్ బిల్లుకు వ్యతిరేకిస్తూ ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్న జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు సభ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. కాగా ఎన్డీయేతర పక్షమైనప్పటికీ బీజేడీ ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషం.
టీఆర్ఎస్,టీడీపీలు ఓటింగ్ దూరం..
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్,టీడీపీ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టికి చెందిన ఐదుగురు ,నమాజ్ వాది పార్టీకి చెందిన మరో ఐదుగురు సభ్యలతో సహా యూపీఏకి సంబంధించిన దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఇలా కొందరు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండటం...మరికొందరు సభ్యులు వాకౌట్ చేయడంతో..అన్యహ్య రీతిలో మరికొందరు మద్దతు తెలపడంతో వంటి పరిణామాలు మోడీ సర్కార్ అనుకూలంగా పరిగణించాయి. ఫలితంగా ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి మార్గం సుగమమైంది.