కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పదునైన వస్తువుతో దాడి.. నిందితుడి అరెస్ట్!

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పదునైన వస్తువుతో దాడి.. నిందితుడి అరెస్ట్!

Last Updated : Nov 18, 2019, 05:31 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పదునైన వస్తువుతో దాడి.. నిందితుడి అరెస్ట్!

న్యూఢిల్లీ: మైసూరులోని నరసింహరాజ నియోజకవర్గం నుంచి కర్ణాటక అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్వీర్ సెయిథ్‌పై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి జరిగింది. ఓ వివాహ వేడుకకు హాజరైన సెయిథ్‌పై మైసూరుకే చెందిన ఓ దుండగుడు హస్తకళల తయారీకి ఉపయోగించే ఓ పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తన్వీర్ మెడకు తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన భద్రతా సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో తన్వీర్ మెడకు ఓ శస్త్ర చికిత్స కూడా జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన్వీర్ పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్టు మైసూరు పోలీసులు తెలిపారు.

 

ఎమ్మెల్యైపై దాడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోబోయిన నిందితుడిని అక్కడే వున్న ఎమ్మెల్యే అనుచరులు, మద్దతుదారులు పట్టుకున్నారు. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మైసూరుకే చెందిన ఫరాన్ పాషా(24)గా గుర్తించారు. ఫరాన్‌పై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేపై దాడికి కారణం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇదిలావుంటే, తమ నాయకుడిపై దాడి జరిగిందని తెలుసుకున్న మద్దతుదారులు.. భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి బయట ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు మైసూరు పోలీసులు తెలిపారు.

Trending News