హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుంచి కారు పడిన ప్రమాదంలో మరణించిన మహిళ సత్యవేణి భర్త సూర్య నారాయణ ప్రమాదం జరిగిన తీరుపై స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం జరిగిందని మొదట నా కుమార్తె సమాచారం ఇచ్చాకే తనకు తెలిసిందని.. ఈ దుర్ఘటన చాలా బాధాకరమని బోరుమన్నారు. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ విజ్ఞప్తిచేశారు. తమకు ఇద్దరు కుమార్తెలనీ.. ఆ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కాగా తాను ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నానని చెప్పారు. తన భార్య హౌస్ వైఫ్ అని చెప్పిన సూర్య నారాయణ.. ఇలాంటి దుర్ఘటనలు ఏ కుటుంబంలోనూ జరకూడదని అన్నారు.
గచ్చిబౌలిలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై వెళ్తున్న ఓ కారు అక్కడి నుండి కింద పడిన దుర్ఘటనలో సత్యవేణి మృతి చెందగా పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌కి పక్కన ఉన్న వ్యాపార సముదాయ భవనాల ముందు అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ రోడ్డు ప్రమాదం పూర్తిగా రికార్డైంది.