వరంగల్: హంటర్ రోడ్డులో శవమై కనిపించిన యువతి రమ్య(19) (అసలు పేరు మార్చడమైనది) హత్య కేసులో భయంకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్న రమ్యతో.. డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న సాయికుమార్ గౌడ్‌కి ఆరు నెలల క్రితమే పరిచయమైంది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండకు చెందిన పులి సాయిగౌడ్ అలియాస్ సాయికుమార్.. ఫోన్లో తరచుగా మాట్లాడుతూ, మెస్సేజ్ చేస్తూ తమ పరిచయం ప్రేమగా మారినట్టు నమ్మించాడు. రమ్యతో పరిచయమైన ఆరు నెలల్లోనే ఆమెతో ప్రేమ నాటకమాడి నమ్మించాడు. ఆ తర్వాత పుట్టిన రోజు నాడు అదను చూసుకుని ఆమెను ఒంటరిగా రప్పించి.. పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించిన సాయికుమార్ గౌడ్.. పుట్టిన రోజున తనను కలవాల్సిందిగా కోరాడు. సాయికుమార్ గౌడ్ మాటలు నమ్మిన రమ్య.. భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అలా రమ్యను ఒంటరిగా కాజీపేటకు రప్పించుకున్న సాయికుమార్.. ఆమెను తన కారులో ఎక్కించుకుని చిన్నపెండ్యాల వద్ద రైలు పట్టాల సమీపంలో ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడే కారును ఓ పక్కకు నిలిపి రమ్యపై అత్యాచారం జరిపి.. ఆ తర్వాత ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా ఆమెను హత్య చేసినట్టు నిందితుడు సాయికుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సాయికుమార్ పోలీసులకు తెలిపాడు. అంటే.. రమ్య ఇంట్లోంచి వెళ్లిన రెండు గంటల వ్యవధిలోనే ఆమె హత్యకు గురైందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.
Read also : మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. బీటెక్ స్టూడెంట్ అరెస్ట్!
సహకరించేందుకు నిరాకరించిన స్నేహితులు:
రమ్య మృతదేహాన్ని కనుమరుగు చేసేందుకు యత్నించిన సాయికుమార్.. తన ఇద్దరు స్నేహితులైన మాచర్ల శ్రీకాంత్, నీలి శ్రీకాంత్‌లను అసలు విషయం చెప్పకుండా అక్కడికి రప్పించాడు. అయితే, అక్కడ రమ్య మృతదేహం చూసి అసలు పరిస్థితి అర్థం చేసుకున్న ఆ ఇద్దరూ సాయం చేసేందుకు నిరాకరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తానొక్కడే రమ్య మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని.. చిన్న పెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి, కాకతీయ యూనివర్శిటీ సెంటర్ మీదుగా తిరుగుతూ హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్దకు వచ్చాడు. అక్కడే రమ్యకు ఓ కొత్త డ్రెస్ కొనుగోలు చేసి.. న్యూ శాయంపేటకు సమీపంలోని రైల్వే పట్టాల వద్దకు చేరుకున్నాడు. ఎవ్వరి కంటపడకుండా రమ్య ఒంటిపై రక్తంతో తడిసి ఉన్న పాత బట్టలు తీసేసి కొత్త డ్రెస్ వేశాడు. ఫలితంగా ఆమెది ఓ సహజ మరణంగా పోలీసులను తప్పుదోవ పట్టించవచ్చని సాయికుమార్ భావించాడు. అనంతరం హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ వద్దకు చేరుకుని రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎవ్వరూ లేని సమయంలో ఆమె శవాన్ని పడేసి అక్కడి నుంచి చేతులు దులుపుకుని వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 2-3 గంటల మధ్య హత్య జరిగితే.. రాత్రి 9 గంటల వరకు రమ్య మృతదేహాన్ని సాయికుమార్ తన కారులోనే తిప్పినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో రమ్య కాల్ డేటా, ఘటనాస్థలంలో లభ్యమైన ఆధారాలు, హంటర్ రోడ్డుకు దారితీసిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడు సాయికుమార్ని పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులను వరంగల్ సీపి రవీందర్ అభినందించారు.