'నేరస్థులను జైలుకైనా పంపండి లేదా ఎన్కౌంటర్లో నైనా చంపేయండి' అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలాఖరులో ఉత్తరప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మీరట్ లో జరుగుతున్న బీజేపీ ర్యాలీకి వెళ్ళడానికి ముందు ఆయన పై విధంగా స్పందించారు. "బీజేపీ అధికారంలో వచ్చాక .. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. మేము అధికారంలోకి రాక ముందు వర్తకులు, యువత నేరగాళ్లకు భయపడి వలస వెళ్లేవారు. కానీ మేము వచ్చాక పరిస్థితి మారిపోయింది" అన్నారు. "మేము అధికారం చేపట్టాక నేరగాళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించాం. వారి మీద అనేక ఆంక్షలు పెట్టాం. ఇప్పుడు వారికున్నవి రెండే దారులు. ఒకటి జైలుకైనా వెళ్లాలి లేదా ఎంకౌంటర్ లో ప్రాణాలైనా వదలాలి" అని అన్నారు.