Earthquake Alert: సాధారణంగా భూకంపాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దూరంగా ఉంటాయి. గత 15-20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇవాళ భూమి కంపించింది. ఉదయం సరిగ్గా 7.27 నిమిషాల ప్రాంతంలో రెండు రాష్ట్రాల్లోనూ 4-5 సెకన్లపాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూ ప్రకంపనలు ఎక్కడెక్కడ సంభవించాయి, అమరావతి పరిస్థితి ఏంటనేది తెలుసుకుందాం.
తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఇవాళ ఉదయం 7.27 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. ఉపరితలం నుంచి భూమిలో 40 కిలోమీటర్ల దిగువన భూ ఫలకాల్లో చోటుచేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్టు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఈ ప్రభావం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కన్పించింది. కొన్ని ప్రాంతాల్లో 2-3 సెకన్లు, మరి కొన్ని ప్రాంతాల్లో 4-5 సెకన్ల పాటు కంపించింది. ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం, జంగారెడ్డి గూడెం, గోకవరం, రాజమండ్రి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, గోదావరి ఖని, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఎన్నడూ చూడని భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేశారు.
ఏ జోన్లో ఎలాంటి తీవ్రత
సిస్మిక్ యాక్టివిటీ అంటే భూమిలోపలి పొరల్లో కదలికల్ని బట్టి నేషనల్ జియోగ్రఫికల్ ఇనిస్టిట్యూట్ నాలుగు జోన్లుగా విభజించింది. జోన్ 5 అంటే తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండి ప్రాణ, ఆస్థి నష్టం తీవ్రంగా ఉంటుంది. జోన్ 2లో సాధారణంగా ప్రకంపనలు వస్తుంటాయి. తెలంగాణ ప్రాంతమంతా జోన్ 2 పరిధిలో వస్తుంది. జోన్ 2లోనే రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదు కావడంతో చర్చనీయాంశమైంది. ఓ మోస్తరు భూకంపాలు వచ్చే ప్రాంతాన్ని జోన్ 3 గా గుర్తిస్తారు.
జోన్ 3లో ఏపీ రాజధాని అమరావతి
దురదృష్టవశాత్తూ ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి అంతా సెస్మిక్ జోన్ 3 పరిధిలో వస్తుంది. అంటే ఈ ప్రాంతంలో ఓ మోస్తరు భూకంపాలు వస్తుంటాయి. అమరావతి ప్రాంతంలో గరిష్టంగా రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత నమోదయ్యే పరిస్థితి లేకపోలేదని నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. అందుకే ఇవాళ సంభవించిన భూ ప్రకంపనలు అమరావతి ప్రాంతానికి ఓ హెచ్చరిక జారీ చేశాయంటున్నారు.
Also read: Earth Quake in Telugu States: తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.