24 గంటల్లో 57 మంది మృతి..!!
కరోనా మరణాల్లో భారత్ కొత్త రికార్డు
'కరోనా వైరస్'.. భారత దేశంలోనూ మృత్యుకేళీ ఆడుతోంది. ఇప్పటి వరకు లేని కొత్త రికార్డులను సృష్టిస్తోంది. 24 గంటల్లోనే మరణాల సంఖ్య 57కు చేరడం గుబులు రేకెత్తిస్తోంది.
భారత్ లో క్రమక్రమంగా విస్తరిస్తున్నకరోనా వైరస్.. కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 24 వేల 500 మార్క్ దాటడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ ఉదయం 8 గంటల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 506గా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 18 వేల 668 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు 5 వేల 63 మందికి చికిత్స చేసి సురక్షితంగా ఇంటికి పంపినట్లు తెలిపింది. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 775 మంది బలయ్యారని వివరించింది. ఐతే తాజాగా 24 గంటల్లోనే 57 మంది చనిపోవడం కలకలం రేపుతోంది. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ గా ఉన్న విదేశీయుల సంఖ్య 70గా ఉంది.
మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో 280 మంది మృతి చెందారు. అంటే దాదాపు 35 శాతం మంది అక్కడే చనిపోయారు. మృతుల సంఖ్య విషయంలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. ఆ తర్వాత మూడో స్థానంలో ఢిల్లీలో అత్యధికంగా కరోనా మహమ్మారికి బలయ్యారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. పకడ్బందీగా అమలు చేస్తుండడంతో కాస్తంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. గత 28 రోజుల్లో దేశవ్యాప్తంగా 15 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. మరోవైపు దేశంలో కరోనా వైరస్ సోకిన వారిలో 20.66 శాతం మంది రికవరీ కావడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..