ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ బిల్డింగ్ డిజైన్ ఖరారైనట్లేనని వార్తలు వస్తున్నాయి. పొడవైన టవర్ నమూనాతో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డిజైన్ చేసిన శాసనసభ పలువురిని ఆకట్టుకుంటోంది. స్పైక్ డిజైన్‌తో రూపొందించిన భవనం ఎత్తు టవర్‌తో కలిపి 250 మీటర్లు. అలాగే వెడల్పు కూడా అంతే పరిమాణంలో ఉంటుంది అంటున్నారు ! 70 అంతస్తులు ఉండే ఈ బిల్డింగ్ నుండే అమరావతి నగరాన్ని మొత్తాన్ని చూడవచ్చంట.
అమరావతికి సంబంధించి తాను రూపొందించిన రెండు డిజైన్లలో ఒకదానికే సీఎం ఆమోదం తెలిపారని అంటున్నారు రాజమౌళి. అయితే పలు మార్పులు మాత్రం సూచించారని అన్నారు. అలాగే రాజమౌళి రూపొందించిన చతురస్రాకారపు భవన నమూనా కూడా వైవిధ్యంగానే ఉంది. నెమలి నాట్యం, బౌద్ధ చక్రం, లేపాక్షి నంది మొదలైనవి ఈ నమూనాలో కనిపించడం విశేషం. బుధవారం అమరావతిలో నార్మన్ ఫోస్టర్ బృందంతో మీటింగ్‌లో పాల్గొన్న అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడారు. ఇటీవలే ఈ రాజధాని విషయమై ఫోస్టర్ బృందంతో చర్చించేందుకు రాజమౌళి లండన్ కూడా వెళ్లారు.