దాయాది దేశం పాకిస్తాన్ పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మళ్లీ తనదైలిలో విరుచుకుపడ్డారు. పాక్ అరాచకాలకు చెక్ పెట్టాలంటే ఆ దేశాన్ని నాలుగు ముక్కలుగా చీల్చడమే పరిష్కారమని పేర్కొన్నారు. భారత్ - పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తే మరే ఇతర దేశం కూడా అందులో జోక్యం చేసుకోదని అన్నారు. ఇందుకు కారణం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌పై ఉన్న ముద్రేనని చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పుకొచ్చారు. పాక్ జైల్లో ముగ్గుతున్న కుల్ భూషణ్ జాధవ్‌ను కలవడానికి వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్‌ల పట్ల పాకిస్తాన్ భద్రతా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి పాక్ అరాచకాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
జాధవ్ కుటుంబానికి పాక్‌లో దారుణ అవమానం
పాక్ జైల్లో ముగ్గుతున్న కుల్ భూషణ్ జాధవ్‌ను చూసేందుకు పాక్ వెళ్లిన అతని కుటుంబ సభ్యులను.. వారి దుస్తుల్ని మార్పించి వేరే బట్టలు వేసుకోమనడం... మెడలో ఉన్న మంగళ సూత్రాలు, గాజుల్ని తీయించడం, బొట్టు ఉండరాదనడం, బూట్లు తీయించడం, జాధవ్‌తో మాతృభాషలో సంభాషించడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవడం లాంటివి విస్మయం కలిగించాయి. చివరకు జాధవ్ భార్య మంగళసూత్రాలు, ఆమె బూట్లను పాకిస్తాన్ అధికారులు వెనక్కి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో స్పందించిన సుబ్రమణ్య స్వామీ..ఈ ఘటనను ‘ద్రవపది వస్త్రాపహరణం’గా అభివర్ణించారు..