భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం తన జన్మస్థలమైన గుజరాత్లోని వాద్ నగర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో తను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలను దర్శించారు. అక్కడి విద్యార్థులు తనకు తిలకం దిద్ది లోపలికి ఆహ్వానించినప్పడు ప్రధాని చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవ్య ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్శన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ "నాకు ఆనాటి మధుర జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకువస్తున్నాయి" అని తెలిపారు. మిషన్ ఇంద్రధనుష్ పథకాన్ని ప్రారంభించే క్రమంలో గుజరాత్ వచ్చిన మోడీ, తన పుట్టిన ఊరుని సందర్శించాలని కూడా భావించి, ఆ ప్రాంతానికి వచ్చారు. మిషన్ ఇంద్రధనుష్ అనే కార్యక్రమం గ్రామ, పట్టణాల్లో పూర్తిస్థాయిలో రోగాల నివారణను కాంక్షిస్తూ, టీకాల వ్యవస్థను పునరుద్ధరించడానికి ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ట్యాబ్లెట్లను ప్రధాని హెల్త్ వర్కర్లకు పంచిపెట్టారు. ఆ ట్యాబ్లెట్లోని ఐ యామ్ టెకో అనే యాప్ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు వారికి కావాల్సిన సమాచారం అందుతుంది.