అమెరికాతో శత్రుత్వాన్ని రోజు రోజుకి పెంచి పోషించుకుంటున్న ఉత్తర కొరియా నేత కిమ్, తమ క్రీడాకారులను దక్షిణ కొరియాలో జరగబోయే శీతాకాల ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి పంపిస్తానని చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌కు క్రీడాకారులను పంపించే గడువు పూర్తయినప్పటికీ.. దక్షిణ కొరియా ఒప్పుకుంటే తమ క్రీడాకారులను పంపిస్తానని కిమ్ చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలో కిమ్ నిర్ణయాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం స్వాగతించింది. శాంతి సామరస్యాలను పెంపొందించడానికే ఈ ఒలింపిక్స్ క్రీడలని.. కిమ్ నిరభ్యంతరంగా తన దేశ క్రీడాకారులను పంపించవచ్చని తెలిపింది. ఉత్తర కొరియాకి చెందిన ఇద్దరు స్కేటర్లు ఇప్పటికే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయినా ప్రస్తుతం సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వారిని పంపించాలా.. వద్దా అన్న కోణంలో తొలుత కిమ్ ఆలోచించడం జరిగింది. ఆ తర్వాత గడువు ముగిసిపోయాక, పంపిస్తానని చెప్పడం జరిగింది.