కేంద్ర బడ్జెట్ 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్యాయం జరిగిందనేది పూర్తిగా అబద్ధమని.. ఇది మిత్రపక్షంలోనే కొందరి నాయకుల వాదన అని ఏపీ రాష్ట్రమంత్రి పైడికొండల మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్డెట్ చాలా బ్రహ్మాండంగా.. అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నిధులనేవి లభిస్తాయని... ఈ విషయంలో అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
రాష్ట్రాలు వేరు.. ఆంధ్రప్రదేశ్ వేరు అని భావించడం సమంజసం కాదని.. అలా అనడం సరికాదని ఆయన తెలిపారు. తానైతే బడ్జెట్ బాగుందని ప్రజల్లోకి వెళ్లి సైతం చెప్పగలనని.. డిపీఆర్ లేనందునే రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రం నిధులు మంజూరు చేయలేదని మాణిక్యాలరావు అన్నారు. పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి.
తెదేపా-భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట పూర్ణగోపాల సత్యనారాయణ(గోపి)పై 14వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు.