ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మరణించారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎస్ఆర్నగర్లోని స్వగృహంలో తెల్లవారుజామున 3:30 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎర్రగడ్డ సెయింట్ థెరిసా హాస్పిటల్కు తరలించారు. ఆయన్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇటీవల గుండు హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది.
తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా ఆయన 400 సినిమాల్లో నటించారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నారు. 1956లో విజయవాడలో జన్మించిన హమునఃతరావు, 1974లో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. మద్రాసులో ఆయన నాటకాన్ని చూసిన జంద్యాల అహనా పెళ్లంట సినిమాలో మొదటి వేషం ఇచ్చారు. అనంతరం వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. బాబాయ్ హోటల్, కొబ్బరి బొండం, యమలీల చిత్రాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఆయన భార్య ఝాన్సీరాణి (45) 2010లో మృతి చెందారు. సినిమాలలో నటించక ముందు హన్మంతరావు స్వీట్ షాపును నిర్వహించేవారు.