కేంద్ర మాజీమంత్రి చిదంబరం కొడుకు కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మసనం కార్తి చిబంబరం పిటిషన్ పై స్పందించాలని సీబీఐని ఆదేశిస్తూ తీర్పును 8వ తేదీకి వాయిదా వేసింది.
కార్తి చిబంబరాన్ని సీబీఐ ఫిబ్రవరి 28న చెన్నైలో అరెస్టు చేసింది. అరెస్టు చేసిన కార్తిని సీబీఐ అధికారులు బైకుల్లా సెంట్రల్ జైల్లో విచారిస్తున్నారు. తండ్రి ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ లభించేలా చేసినందుకు కార్తికి ముడుపులు ముట్టాయని సీబీఐ అంటోంది. అయితే, సీబీఐ ఆరోపణలు అవాస్తవమని.. ఇదంతా రాజకీయ కక్ష్యతో చేస్తున్నవేనని కార్తి వాదిస్తున్నాడు.