Bandi Sanjay on Drugs Case: ఇటీవల హైదరాబాద్‌లోని పబ్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. డ్రగ్స్ దందాలో ఉన్నదంతా కాంగ్రెస్, బీజేపీ నాయకుల పిల్లలేనని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే... అసలు ఆ దందా నడిపిస్తున్నదే టీఆర్ఎస్కి చెందిన నేతలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఇదే వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు సంచలన ఆరోపణలు చేశారు.
డ్రగ్స్ దందాలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. అంతేకాదు, అందులో కేసీఆర్ సన్నిహితుల హస్తం ఉందన్నారు. అందుకే డ్రగ్స్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ కఠిన చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుస్తోంటే... దాన్ని నిర్మూలించాలనే సోయి సీఎంకు లేదని విమర్శించారు. హైదరాబాద్ అంటేనే డ్రగ్స్‌కు, తాగుబోతులకు అడ్డాగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది అని విమర్శించారు. అప్పట్లో ఉడ్తా పంజాబ్ అనే సినిమా సంచలనం సృష్టించిందని... అదే తరహాలో ఇప్పుడు ఉడ్తా హైదరాబాద్ పేరుతో సినిమా తీసే పరిస్థితి వచ్చిందని అన్నారు.
పంజాబ్‌లో అక్కడి ప్రభుత్వం కూలిపోయిందంటే డ్రగ్స్ వ్యవహారమే కారణమన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందన్నారు. డ్రగ్స్ దందా పట్ల టీఆర్ఎస్ నిర్లక్ష్య వైఖరితో తెలంగాణలోని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న తమ పిల్లల గురించి వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు. బతికుంటే బఠానీలైనా అమ్ముకోవచ్చు కానీ చదువొద్దు, ఉద్యోగమొద్దు ఇంటికి వచ్చేయండని తల్లిదండ్రులు పిల్లలను కోరే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ డ్రగ్స్ వాడుతున్నారనే కారణంతో 15 మంది ఉద్యోగులను తొలగించిందన్నారు బండి సంజయ్. దీన్నిబట్టి నగరంలో డ్రగ్స్ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు 1000 మందితో కూడిన ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీకి వివరాలు సమర్పించాలని హైకోర్టు కోరినా ప్రభుత్వం ఆ వివరాలు సమర్పించలేదన్నారు. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయినప్పటికీ ఆ వివరాలు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుభయపడుతోందని ప్రశ్నించారు. ఏ కేసైనా తొలుత హడావుడి చేయడం.. ఆ తర్వాత దాన్ని మరుగునపడేయడం కేసీఆర్‌కు అలవాటేనని విమర్శించారు.
Also Read: Yami Gautam: ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని ఫాలో అయ్యేదాన్ని.. ఇకపై కాను! రివ్యూపై యామీ గౌతమ్ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook