ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో రేషన్ డీలర్ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకు ఓ వృద్దురాలిని కొట్టి చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిరాజాబాద్ గ్రామానికి చెందిన ఆశి అనే 75 ఏళ్ల వృద్దురాలు స్థానిక చౌకధరల దుకాణంలో జరిగే అక్రమాలపై పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. తక్కువ రేషన్ ఇస్తున్నారని.. పేదవారికి అందాల్సిన సరకులను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని తెలిపింది.
ఆమె ఫిర్యాదుపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమెపై దాడికి దిగిన రేషన్ డీలర్ నసీమ్ తన మనుషులతో వచ్చి ఆ వృద్దురాలిని విచక్షణా రహితంగా కొట్టడంతో మరణించిందని.. ఆమె కుమారుడు భురా పోలీస్ సర్కిల్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎప్పుడైతే వృద్దురాలిని దారుణంగా కొట్టడం వల్ల చనిపోయిందనే వార్త ఫిరాజాబాద్ ప్రాంతంలో తెలిసిందో స్థానికులందరూ ఏకమయ్యారు. నేరస్థులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. రేషన్ డీలర్ నసీంతో పాటు ఆయనకు సహకరించిన షామిమ్, జాను అనే ఇద్దరు వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశారు.