తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కొద్ది నిముషాలు కెమిస్ట్రీ టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. హసనపర్తి ప్రభుత్వ ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్‌ను సందర్శించిన ఆయన అధికారులను బోధిస్తున్న తీరు, ఉపాధ్యాయుల వైఖరి మొదలైన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంసెట్‌తో పాటు ఐఐటి, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు కూడా సన్నద్ధం చేస్తున్నట్లు కోచింగ్ సెంటర్ సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు.
వారికి కొంచెం సేపు క్లాస్ తీసుకున్నారు. విద్యార్థులకు కెమిస్ట్రీ సబ్జె్క్టుని బోధించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఇటీవలి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు గాను ఉచిత కోచింగ్ ఇచ్చే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. చిత్రమేంటంటే.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండే ఎంఎస్సీ పాసయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు సిండికేట్ బ్యాంకులో మేనేజరుగా పనిచేశారు. ఆ తర్వాత 1977 నుండి 1987 వరకు దాదాపు పది సంవత్సరాలు జూనియర్ లెక్చరర్‌గా పనిచేశారు.