Mamatha Meeting:భారత రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్లను స్వీకరిస్తున్నారు. పోటీ అనివార్యమైతే జూలై 18న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే దేశంలో రాజకీయ వేడి నెలకొనగా.. ఇప్పుడు మరింత వేడెక్కింది. ఎన్నిక ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. పోటీ జరిగినా ఈజీగా గెలుస్తామనే ధీమాలో ఉంది. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విపక్షాలను ఏకం చేసి ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న 19 రాజకీయ పార్టీల నేతలను మమత ఆహ్వానించారు. వీరిలో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మమత సమావేశానికి డుమ్మా కొట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే యోచనలో కేజ్రీవాల్ ఉన్నారని చెబుతున్నారు.
విపక్ష నేతలందరిని ఆహ్వానించిన మమతా బెనర్జీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఎంఐఎం చీఫ్ అసద్ తో పాటు జనసేనకు ఆహ్వానం పంపలేదు. జనసేనతో బలం లేనందున పెద్ద విషయం కాదు. కాని టీడీపీ, వైసీపీలను పిలవకపోవడంతో.. ఆ రెండు పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయని మమత భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక తమకు మమత ఆహ్వానం రాకపోవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తమకు ఎలాంటి ఆహ్వానం లేదని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది జగన్ నిర్ణయిస్తారని చెప్పారు. విపక్షాలు తమ అభ్యర్థిని నిలబెడుతాయా లేదా అన్నది తమకు తెలియదని చెప్పారు సాయి రెడ్డి. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలను అనుభవించాల్సిందేనంటూ రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై కామెంట్ చేశారు.
సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిల్ పైనే విచారణ సాగుతోందని అన్నారు. ఈడీ విచారణపై రాజకీయం చేయడం సరికాదన్నారు వైసీపీ ఎంపీ.
మమతా బెనర్జీ సమావేశంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. మమత సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఒవైసీ తెలిపారు. ఒకవేళ తనకు ఆహ్వానం అందినా... ఆ సమావేశానికి తాను వెళ్లేవాడని కాదన్నారు అసద్. కాంగ్రెస్ పార్టీ వస్తే తాము ఉండమన్నారు. మమత కాంగ్రెస్ ను ఆహ్వానించారు కాబట్టి... ఆ సమావేశానికి తాము వెళ్లబోమని తేల్చి చెప్పారు. టీఎంసీ తమ పార్టీ గురించి చాలా దారుణంగా మాట్లాడిందని... అలాంటప్పుడు వారి సమావేశానికి తాము ఎలా వెళతామని ఒవైసీ అన్నారు.
Read also: UGC OFFER: విద్యార్థులకు సూపర్ న్యూస్.. పీజీ లేకుండానే పీహెచ్డీ .. యూజీసీ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook